దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో మాత్రమే ప్రభుత్వం అన్ని వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గొర్రె పిల్లల పంపిణీ పథకం అమలవుతోందని తెలిపారు. మునుగోడు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించామని చెప్పారు. కుల వృత్తులకు పునర్‌వైభవం తీసుకురావడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వెల్లడించారు.
రాష్ట్రంలో రూ.11 వేల కోట్లతో గొర్రె పిల్లల పంపిణీ చేపట్టామని తలసాని తెలిపారు. రెండో విడత లబ్ధిదారులందరికీ నగదు బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. నగదు బదిలీని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో చిల్లర రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. కుల వృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
“కాంగ్రెస్, బీజేపీలు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నాయి. బీజేపీ నేతలు అబద్ధపు మాటలు చెబుతూనే ఉంటారు. గొల్లకురుమలకు ఇచ్చే డబ్బులను ఆపడం దుర్మార్గం. హైదరాబాద్ నగరంలో ఉపఎన్నిక వస్తోందన్న వార్తలు అవాస్తవం. అవన్నీ గాలి వార్తలు.” అని తలసాని అన్నారు.