హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.46లోని అంబేద్కర్ నగర్ లో ఇవాళ కొన్ని ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఒక అధికారి చేసిన తప్పిదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు మంత్రి తలసాని . ఈ ఘటనపై సమీక్ష నిర్వహించినట్టు తలసాని వెల్లడించారు. అంబేద్కర్ నగర్ లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఇక్కడ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తుందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. కోరుకున్న వారికే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని వివరించారు.
సొంతస్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి జీవో 58 కింద స్థలాలను క్రమబద్ధీకరించడం జరుగుతుందని మంత్రి తలసాని వెల్లడించారు. వారం రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అంబేడ్కర్‌నగర్‌లో పర్యటిస్తామన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ఈ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారితో ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు.