దేశ రాజధానిలో మరో దారుణం చోటుచేసుకుంది. 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన గదిలో మహిళను గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురు రైల్వే ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు.. మహిళపై అత్యాచారానికి పాల్పడగా.. మరో ఇద్దరు వారికి సహకరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
“బాధితురాలు తన కుటుంబంతో కలిసి ఫరాదాబాద్లో నివసిస్తోంది. కొంత కాలం క్రితం ఆమెకు రైల్వేలో పనిచేస్తున్న ఓ యువకుడితో పరిచయమైంది. తనను కలవాలని అతడు మహిళను కోరగా.. గురువారం రాత్రి ఆమె రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. వెళ్లిన తర్వాత అతడు ఆమె ప్లాట్‌ఫారమ్ నంబర్8-9 లో ఓ గదిలోకి తీసుకువెళ్లాడు. కొంతసేపటికి మద్యం మత్తులో ఉన్న అతడి దగ్గరికి మరో ముగ్గురు స్నేహితులు వచ్చారు. ఈ నిందితుల్లో ఇద్దరు తనపై అత్యాచారం చేశారు.మరో ఇద్దరు నిందితులు వాళ్లకు సాయం చేశారు. ఘటన అనంతరం మహిళను ఆమెకు పరిచయస్తుడు బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొట్టాడు.” అని పోలీసులు తెలిపారు.
బయటకు వచ్చిన తర్వాత మహిళ పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడి నుంచి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. తనకు సహకరించిన ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పగా.. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జగదీశ్, మంగళ్, వినోద్, సతీశ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో నలుగురు నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.