గృహాలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలో 3 వేల మందికి 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం పంపిణీ, వచ్చిన దరఖాస్తు లపై సమగ్ర విచారణ జరిపి అర్హులను గుర్తించాలన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి చేయూతను అందించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.
పేదల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వ ఉన్నతమైన లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. పేదింటి ఆడపడుచుల పెండ్లికి లక్ష నూట పదహార్లు ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా పెన్షన్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.