తెలంగాణలో రాజకీయాలు మునుగోడు వైపే చూస్తున్నాయి. అయితే.. మునుగోడులో మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పీబీ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలకు కాషాయ రాజకీయ పాలన ముప్పుగా మారిందన్నారు. ఆ పార్టీ రాష్ర్టాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు అనే దుర్మార్గమైన సిద్ధాంతాలను పాటిస్తున్నదని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను డబ్బు పెట్టి కొనేందుకు దుకాణం మొదలెట్టిందని విమర్శించారు.
అలాంటి పార్టీకి చెందిన నాయకులు కొంతమంది అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎం కలిసి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సీపీఐతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా అవకాశవాదమని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి సీపీఎం కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేశారని, అందుకే ఆయన్ని ఓడించేందుకు సీపీఎం కృషి చేస్తుందని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ నాయకులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.