జనసేన వైపు చూస్తున్న గోదావరి జిల్లా టీడీపీ‌ కీలక నేత

కోనసీమలో టీడీపీ కీలక నేత పార్టీ మార్పు పై మళ్లీ చర్చ మొదలైంది. టీడీపీలో ఎక్కువ రోజులు ఉండబోరని.. పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గోదావరి జిల్లాలో‌ బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మొన్నటి వరకు టీడీపీ ఉపాధ్యక్షుడు. ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత నెహ్రూ భవితవ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ మార్పు జరుగుతున్న ప్రచారం పై జ్యోతుల శిబిరం మౌనంగా ఉండటంతో సొంత పార్టీ కేడర్ లోనూ అనుమానాలు బలపడ్డాయి. అయితే పార్టీ మార్పు వెనుక‌ జ్యోతుల‌ లెక్కల పై గోదావరి జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది.


పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ తీసుకున్న నిర్ణయంపై విభేదించి పార్టీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు. ఇది పార్టీలోనూ చర్చకు దారితీసింది. ప్రస్తుతం జగ్గంపేట టీడీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు నెహ్రూ. ఇక పరిషత్‌ ఎన్నికలు ముగిశాక‌ కూడా పార్టీ నేతలు ఎవరైనా ఆయనతో మాట్లాడారా లేదా అన్నది ప్రశ్నగానే ఉంది. పార్టీ పదవికి రాజీనామా చేసిన తర్వాత సైలెంట్‌ అయ్యారు జ్యోతుల. ఈ మధ్య తిరుపతిలో చంద్రబాబు ప్రచారంపై రాళ్లు పడ్డాయన్న ఘటనపై స్పందించారు. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు గానీ.. పార్టీ నేతలు వచ్చి బుజ్జగించారని కానీ ఎక్కడా బయటకు చెప్పలేదు. దీంతో టీడీపీ పెద్దలకు నెహ్రూకు మధ్య గ్యాప్‌ వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు.

నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్‌ కాకిినాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల నారా లోకేష్‌ జిల్లా పర్యటనలో కూడా యాక్టివ్ గా పాల్గోన్నారు. నెహ్రూ మళ్లీ పార్టీ మారతారని చర్చ జరుగుతుండటంతో.. ఆయన గతంలో వివిధ పార్టీలలో ఉన్న అంశాలు ప్రస్తావనలోకి వస్తున్నాయి. 1999లో జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యేగా నెహ్రూ గెలిచారు. తర్వాత 2009లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో అసెంబ్లీలో వైసీపీ ఉపనేతగా వ్యవహరించారు కూడా. కాపు సామాజికవర్గం నాయకుడు కావడంతో పార్టీలో ప్రాధాన్యం ఇచ్చారని చెబుతారు. కానీ 2016లో తిరిగి టీడీపీలోకి వచ్చేశారు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం.. ఇప్పటి వరకు జరిగిన లోకల్‌ ఎన్నికల్లో పార్టీ పుంజుకోకపోవడంతో ఆయన పునరాలోచనలో పడ్డారని అనుకుంటున్నారు. తన కోసం కాకపోయినా కుమారుడు నవీన్‌ రాజకీయ భవిష్యత్‌ కోసమైనా నెహ్రూ పార్టీ మారొచ్చని చర్చ జరుగుతోంది. పరిషత్‌ ఎన్నికలపై టీడీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించడాన్ని ఆ కోవలోనే చూడాలంటారు కొందరు. వైసీపీకి తిరిగి వెళ్లే అవకాశాలు లేవట. అందుకే జనసేన వైపు నెహ్రూ ఆయన అనుచరగణం చూస్తోందని తెలుస్తుంది.