ఏపీలో వరుసగా టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే కందుకూరు చంద్రబాబు రోడ్ షోలో..తొక్కిసలాట జరిగి..అనూహ్యంగా 8 మంది టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఇక వీరికి చంద్రబాబు, పార్టీ నేతలు ఆర్ధిక సాయం అందించారు. ఇక చంద్రబాబు ప్రచార పిచ్చి వల్లే..ఇరుకు రోడ్డులో సభ పెట్టడం వల్లే తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయారని వైసీపీ ఆరోపణలు చేసింది.
జనం భారీగా వస్తున్నా సరే టీడీపీ సభలకు పోలీసుల సెక్యూరిటీ ఎక్కువ పెట్టడం లేదని..అదే జగన్..ఏదైనా పెళ్లిళ్లకు వెళ్ళిన అక్కడ వందల మంది పోలీసులతో సెక్యూరిటీ ఇస్తున్నారని టీడీపీ మండిపడింది. ఇక కందుకూరు ఘటన మరవక ముందే తాజాగా గుంటూరులో కూడా తొక్కిసలాట జరిగింది. వుయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా చంద్రబాబు హాజరై, ప్రసనగించి వెళ్ళిపోయారు. కానీ బాబు వెళ్ళాక కానుకని పంపిణీ చేసే సమయంలో తోపులాట జరగడం, వెంటనే తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు.
ఇక చనిపోయిన వారికి వుయ్యూరు ఫౌండేషన్ ద్వారా 20 లక్షలు సాయం ప్రకటించారు. ఈ ఘటనపై చంద్రబాబు వెంటనే స్పందించి..మృతులకు సంతాపం తెలియజేసి..పార్టీ తరుపున 5 లక్షల సాయం ప్రకటించారు. అటు టీడీపీ నేతలు కూడా తమవంతు సాయం అందించారు. ఈ ఘటనపై జగన్ స్పందించి..2 లక్షలు ప్రకటించారు. ఇక చంద్రబాబు ప్రచార పిచ్చి వల్లే ముగ్గురు చనిపోయారని మంత్రి విడదల రజిని ఆరోపించారు.
ఈ ఘటనపై రెండు పార్టీల మధ్య మళ్ళీ రచ్చ మొదలైంది. అయితే ఇలా వరుస ఘటనలు జరగడం, నిండు ప్రాణాలు పోవడంపై టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని, దీన్ని సీరియస్ గా తీసుకుని టీడీపీ అధిష్టానం పనిచేయాలని అంటున్నారు. వైసీపీ మాత్రం బాబు ప్రచార పిచ్చి అంటుంది. మరి ఇందులో నిజమెంతో క్లారిటీ లేదు.