ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఒకరిపై ఒకరు..విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు చేశారు. కరెంట్ లేక రాష్ట్రం చీకట్లో మగ్గిపోయేలా జగన్ చేశారని ధూళిపాళ్ల ఆరోపించారు. అంతేకాకుండా విద్యుత్ కోతల వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోతున్నాయని ధూళిపాళ్ల మండిపడ్డారు. దీంతో పాటు జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి రోజు దండం పెడుతున్నారని, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికే భయపడుతున్నాయని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా పేదవాడిని కొట్టి అదానీకి జగన్ పెడుతున్నారన్న నరేంద్ర .. రాష్ట్రంలో సోలార్ పవర్ రూ. 2కే లభిస్తుంటే… అదానీ దగ్గర రూ. 4కు కొనాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అదానీతో జగన్ కు చీకటి ఒప్పందాలు ఉన్నాయని… అవి ఆగకూడదనే రీతిలో జగన్ పాలన సాగుతోందని ఆరోపించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాల వల్ల పేదలపై వేల కోట్ల రూపాయల భారం పడుతోందని, వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ ను తొమ్మిది గంటల నుంచి ఏడు గంటలకు తగ్గించారని ధూళిపాళ్ల మండిపడ్డారు.