చంద్రబాబు నిరసన పై టీడీపీలో ఆసక్తికర చర్చ

-

టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు పదిగంటలపాటు రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఒంటరిగా ధర్నా చేశారు . పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన నాయకుడు ఒక్కడే కింద కూర్చుని అన్నేసి గంటలు నిరసన తెలియజేయడం సంచలనమైతే.. ఆ విధంగా ఆందోళన చేస్తున్నప్పుడు పార్టీ నేతలు ఆ స్థాయిలో స్పందించలేదన్న చర్చ ఇప్పుడు టీడీపీలో మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో చిన్నా చితకా నిరసనలు జరిగినా.. సీనియర్ నేతలు కంటికి కనిపించలేదు.చంద్రబాబు తన స్థాయిని మరిచి నిరసన తెలియజేసినా సొంత జిల్లాలో పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకోలేదన్న దాని పై తెలుగు తమ్ముళ్లలోనే ఆసక్తికర చర్చ నడుస్తుంది.


పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపోల్స్‌పై టీడీపీ ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో ఎదురైన పరిణామాలపై నిరసన తెలియజేడానికి తిరుపతి వచ్చారు చంద్రబాబు. ఇటీవలే కుప్పంలో పర్యటించి వెళ్లిన వెంటనే మరోసారి చిత్తూరు జిల్లాలో పర్యటనకు సిద్ధపడ్డారు. కుప్పం పల్లెపోరు ఫలితాలు చూసిన తర్వాత సొంత జిల్లాలో పట్టుతప్పుందని భావించారో ఏమో.. వెంటనే యాక్షన్‌లోకి దిగారు. అయితే నిరసనకు అనుమతి లేదని చంద్రబాబును ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు పోలీసులు. అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు టీడీపీ అధినేత. రాత్రి ఏడుగంటల విమానంలో తిరిగి హైదరాబాద్‌ పంపేంత వరకు ఎయిర్‌పోర్టులో బాబు ఆందోళన కొనసాగింది. ఈ నిరసన గురించి క్షణాల్లోనే టీడీపీ శ్రేణులకు తెలిసినా.. బాబు బైఠాయించిన ఫొటోలు.. వీడియోలు బయటకు వచ్చినా తెలుగు తమ్ముళ్లు.. పార్టీ నేతలు చురుకుగా స్పందించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు అధికారపక్షం చంద్రబాబు నిరసనను ఓ ప్రచార స్టంట్‌గా కొట్టిపారేసినా.. ఆ స్థాయిలో టీడీపీ నేతలు రియాక్ట్‌ లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంతో మొదలుకొని ఏపీ వ్యాప్తంగా వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ, ప్రభుత్వ పదవులు అనుభవించి హైపోజిషన్‌లో ఉన్నవాళ్లు ఎవరూ అనుకున్నంత స్ట్రాంగ్‌గా ప్రొటెస్ట్‌ చేయలేదనే అభిప్రాయం దేశం వర్గాల్లో వ్యక్తమవుతోందట. మంత్రులుగా పనిచేసిన వారు..ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమైపోయారనే చర్చ మొదలైంది. కొందరు సెల్ఫీ వీడియోలు.. మరికొందరు ప్రకటనలు విడుదల చేసి తమ పని అయిందని అనిపించారట.

టీడీపీలో ప్రోగ్రాం కమిటీ అని ఒకటి ఉంది. పార్టీలోని అన్ని కార్యక్రమాలు, నేతల పనితీరును మదించే వింగ్‌గా ఈ కమిటీని పిలుస్తారు. అయితే సీరియస్‌నెస్‌ లేకుండా ఎప్పుడంటే అప్పుడు.. ఏదంటే అది మెసేజ్‌లు పెట్టి నిరసనలు చెయ్యాలని పిలుపు ఇస్తున్నారట. దీంతో ప్రోగ్రామ్‌ కమిటీల నుంచి వచ్చే మెసేజ్‌లను లైట్‌ తీసుకోవడం మొదలుపెట్టారు పార్టీ నేతలు. తప్పదు అనుకుంటే ఓ నలుగురు తమ పార్టీ కార్యాలయం వద్దనే రోడ్డెక్కి ఓ ఫోటో షేర్ చేస్తున్నారట. పార్టీ కింది స్థాయిలో ఎలా ఉంది..నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకోకుండా వరుసగా కార్యక్రమాలు ఇవ్వడంపై ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందట.

దీంతో స్వయంగా చంద్రబాబు నేలపై కూర్చున్న సందర్భంలోనూ అనుకున్న స్థాయిలో క్యాడర్ రోడ్డెక్కకుండా టీవీలకు అతుక్కుపోయింది. ఇదంతా ఒకఎత్తు అయితే సాయంత్రం చంద్రబాబుకు ఇచ్చే నివేదిక మరో ఎత్తు అంటున్నారు పార్టీ నేతలు. మీ అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ రోడ్డెక్కారు అంటూ చంద్రబాబు ఎదుట పెద్ద లిస్ట్ పెట్టేశారట. ఇలా అయితే కష్టమేనంటూ దీనిపైనే తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news