టీడీపీ అత్యంత కీలకంగా భావించే మహానాడు కార్యక్రమానికి చంద్రబాబు ఎట్టకేలకు అనేక తర్జన భర్జనల తర్వాత ముహూర్తం పిక్స్ చేశారు. మే 28న పార్టీ వ్యవస్తాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించు కుని నిర్వహించే మహానాడుకు చాలా ప్రాధాన్యమే ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గత ఏడాది బ్రేక్ పడింది. గత ఏడాది ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన దరిమిలా.. మహానాడునువాయిదా వేశారు. ఇక, ఈ ఏడాది మహానాడుకు ముహూర్తం దగ్గర పడింది.
వాస్తవానికి ఎప్పుడు చేసినా.. భారీ ఎత్తున ఓ పండుగలా మహానాడును నిర్వహించేవారు. సీబీఎన్ ఆర్మీ పేరుతో పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి, డిజిటల్ హంగులతో దీనిని భారీగా ఏర్పాటు చేసేవారు. విభిన్న రకాల వంటకాలతో ఆహూతులను మైమరిపింపజేసేవారు. అదేసమయంలో పార్టీ తరఫున కీలకమైన నిర్ణయా లు తీర్మాలను తీసుకునేందుకు మహానాడును వేదిక చేసుకున్నారు. మరి ఈ దఫా లాక్డౌన్తో ఇంత భారీ స్థాయిలో నిర్వహించే పరిస్థితి లేనే లేదు. వాస్తవానికి అసలు నిర్వహించాలా? వద్దా? అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు వరుస ఆన్లైన్ సమావేశాలు పెట్టి దీనిపై పెద్ద ఎత్తున చర్చించారు. ఆఖరుకు దీనిని నిర్వహించాలనే నిర్ణయించారు. అయితే, ఈ మహానాడు మొత్తం కూడా జూమ్ యాప్ ద్వారా నిర్వహించాలని, అంతా ఆన్లైన్లోనే జరగాలని నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తి చేశారు. భౌతిక దూరం పాటించడంతోపాటు.. మాస్కులు ధరించి.. నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, కీలకమైన నాయకులు మాత్రమే ప్రత్యక్షంగా కార్యక్రమానికి వస్తారని,
మిగిలిన వారంతా.. జూమ్ ద్వారా ఆన్లైనే హాజరుకావాలని ఇప్పటికే చంద్రబాబు ఆహానాలు పంపారు. మొత్తానికి బాబు తన వ్యూహం మార్చుకునైనా మహానాడును నిర్వహిస్తుండడంపై పార్టీలో సంతోషం వ్యక్తమవుతున్నా.. కీలకమైన ఈ కార్యక్రమాల సమయంలో అధికార వైసీపీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో.. ఎవరైనా నాయకులను తనవైపు తిప్పుకొని మహానాడుపై ఎఫెక్ట్ పడేలా చేస్తుందేమో.. అనే సందేహాలు కూడా వ్యక్తం కావడం గమనార్హం. మరి ఇలాంటి పరిణామమేదైనా ఏర్పడితే.. బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.