ఏపీలో పాత అయినా కొత్త పొత్తు పొడుపు పొడవనుంది..సైకిల్‌తో జనసేనాని సవారీ చేయడం దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. జగన్‌కు చెక్ పెట్టాలంటే చంద్రబాబుతో స్నేహం చేయాల్సిందే అని సేనాని పవన్ కల్యాణ్ ఫిక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కమలానికి పవన్ షాక్ ఇవ్వడం రెడీ అయిపోయిందని తాజాగా వెలువడిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో తేలిపోయింది.
అసలు మొదట నుంచి మన సేనానికి కూడా బాబు మాదిరిగా ఏదొక పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉండలేరని తెలిసిపోయింది. ఎందుకంటే ప్రశ్నిస్తానని చెప్పి జనసేన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో టిడిపి-బిజేపిలకు సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు బాబు సిఎం అవ్వడానికి కృషి చేశారు. 2019 ఎన్నికల ముందు టిడిపి, బిజేపిలపై ఫైర్ అయ్యి, ఆ రెండు పార్టీలకు దూరం జరిగారు. ఇక ఎన్నికలోచ్చేసరికి సిపిఎం, సిపిఐ, బిఎస్‌పిలతో పొత్తు పెట్టుకుని తొలిసారి బరిలో దిగి ఘోరంగా ఓడిపోయారు.
ఆ తర్వాత నుంచి రాజకీయాలని కాస్త లైట్ తీసుకుని సినిమాల్లో బిజీ అయ్యారు. కాకపోతే కేంద్రంలో బిజేపి అధికారంలో ఉండటంతో సేఫ్‌గా ఆ పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకుని రాజకీయం చేయడం మొదలుపెట్టారు. బిజేపితో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు పావలా ఉపయోగం లేదని తేలింది. పైగా ఉన్న ఓటు బ్యాంకు దూరమయ్యేలా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్తితుల్లో ఏం చేయాలని ఆలోచన చేస్తున్న పవన్‌కు…ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో మంచి ఆప్షన్ దొరికింది.
అనధికారికంగా కొన్ని మండలాల్లో టిడిపి-జనసేనలు పొత్తు పెట్టుకుని సక్సెస్ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం, పి. గన్నవరం, ఆలమూరు, రాజోలు, వి.ఆర్. పురం, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం, ఆచంట, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలాల్లో టిడిపి-జనసేనలు పొత్తు పెట్టుకుని విజయం సాధించాయి… ఆయా మండలాల్లో వైసీపీకి చెక్ పెట్టాయి. ఇక ఈ పొత్తుని పవన్ పరోక్షంగా కూడా సమర్ధించుకున్నారు. పైగా బిజేపికి సపోర్ట్ ఇచ్చిన సత్తా చాటలేకపోయిందనే విధంగా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. అంటే ఇంకా రానున్న రోజుల్లో పవన్…బాబుతో కలిసి ముందుకెళ్తారని అర్ధమైపోతుంది. ఇప్పటికే బాబు, పవన్‌ని ఎప్పుడు కలుపుకుందామా అని ఆతృతగా చూస్తున్నారు. ఇక ఆ సమయం ఇప్పుడు వచ్చేసినట్లే కనిపిస్తోంది.