అన్యమతస్తుడు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దేవాలయాల విషయంలో అనుచిత ఘటనలను అడ్డం పెట్టుకుని టిడిపి నేతలు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇటువంటి రాజకీయాలకు స్వయంగా చంద్రబాబునాయుడే తెరలేపటం ఆశ్చర్యంగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేవాలయాలపై పద్దతి ప్రకారం దాడులు మొదలైనట్లు చంద్రబాబు ఆరోపించారు. అనుచిత ఘటనలు జరిగిన దేవాలయాలను జగన్ ఎందుకు సందర్శించలేదంటూ చంద్రబాబు ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది.
ఆలయాలపై దాడులు జరుగుతుంటే జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ నిలదీశారు. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం ఆలయ రథం దగ్దం ఘటనను సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. జగన్ మాట్లాడటం కావాలా ? లేకపోతే ఘటనలు పునరావృతం కాకుండా చూడాలా ? అన్నదే టిడిపి తేల్చుకోలేకపోతోంది. ఒక్క ఆలయాన్నైనా జగన్ సందర్శించారా ? అని చంద్రబాబు అడగటంలో కూడా అర్ధంలేదు. దేవాలయాలను సందర్శిస్తేనే జగన్ కు హిందు దేవాలయాలపై నమ్మకం ఉన్నట్లా ?
సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే సమయంలో జగన్ ఒంటరిగా వెళ్ళకూదట. సతీ సమేతంగా వెళ్ళి పట్టువస్త్రాలను ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు గోల చేయటమే ఆశ్చర్యంగా ఉంది. సతీ సమేతంగా వెళ్ళకుండా జగన్ ఒంటరిగా వెళితే రాష్ట్రానికి అరిష్టం వస్తుందని సెంటిమెంటు లేవదీయటమే మరీ చీప్ గా ఉంది.
ఎప్పుడైతే ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారో వెంటనే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వెంటనే అందుకున్నారు. ఆయన ఏకంగా చరిత్రలోకే వెళ్ళిపోయారు. చరిత్రలో కూడా తిరుమల దర్శనం కోసం శ్రీకృష్ణ దేవరాయలు కూడా సతీ సమేతంగానే వెళ్ళినట్లు చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలంతటి వాడే సతీ సమేతంగా తిరుమలకు వెళ్ళినపుడు జగన్ ఒంటరిగా ఎలా వెళతాడంటూ వితండ వాదన మొదలుపెట్టేశారు.
శ్రీకృష్ణదేవరాయలు కన్నా జగన్ పెద్ద తోపా, జగన్ తనను తాను మోనార్కనుకుంటున్నాడా ? అంటూ మాట్లాడేశారు. అసలు తిరుమలకు సతీసమేతంగా వెళ్ళాలా ? లేకపోతే ఒంటిగా వెళ్ళాలా అన్నది జగన్ వ్యక్తిగత వ్యవహారం. మరి దీన్ని కూడా టిడిపి ఎందుకు రాజకీయం చేస్తోందో అర్ధం కావటం లేదు.
-vuyyuru subhash