ప్యూహత్మకంగానే టీడీపీ కొడాలిని ముగ్గులోకి లాగిందా

-

అంశమేదైనా ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడి చర్చల్లోకి వస్తారు ఫైర్ బ్రాండ్ మినిస్టర్ కొడాలినాని. ఆయన నోరు తెరిస్తే…మాటల తూటాలు పేలాల్సిందే. ప్రస్తావించిన అంశాలు.. ఉపయోగించే పదాలు ఆ తర్వత మాటల మంటలు పుట్టిస్తాయి. కొడాలి నాని మీడియా ముందుకు వస్తే చాలు.. ఏం మాట్లాడతారు? ఎవరిపై ఏ విధంగా విరుచుకుపడతారో తెలియదు. ఈ వైఖరి వల్ల ఆయన ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా సైలెంట్ గా ఉన్న కొడాలినానిని టీడీపీ ప్యూహత్మకంగా ముగ్గులోకి దింపిందా అన్న చర్చ నడుస్తుంది.

కొడాలి నాని తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ప్రయోగించిన పదాలు ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని భావించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఆ ప్రెస్‌మీట్‌ అయిన అరగంటలోనే షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. సాయంత్రం ఐదుగంటలలోపు వివరణ ఇవ్వాలని గడువు పెట్టడంతో న్యాయ నిపుణులను సంప్రదించి రిప్లయ్‌ ఇచ్చారు మంత్రి. అయితే ఆ ఎపిసోడ్‌ అక్కడితో ఆగలేదు. మంత్రి ఇచ్చిన వివరణపై ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. కొడాలి నాని పశ్చాత్తాపం పడిన దాఖలాలు లేవని చెబుతూ కొన్ని ఆంక్షలు పెట్టింది. మీడియా ముందుకు రావొద్దని, సమావేశాల్లో మాట్లాడొద్దని కొడాలిని కట్టడి చేసింది. ఎస్ఈసీ ఇచ్చిన ఈ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు మంత్రి.

ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలోనే వివాదం మరో మలుపు తీసుకుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో ఆర్డర్‌ పాస్‌ చేశారు. తనను బెదిరించిన మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలిచ్చారు నిమ్మగడ్డ. అంతేకాదు.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు కూడా నమోదు చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా కొడాలి నాని సైతం అస్త్రాలు బయటకు తీస్తున్నారు. మరోసారి నోటికి పనిచెప్పి ఇరకాటంలో పడ్డారు. ఏకంగా ఆయనపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని నిమ్మగడ్డ ఆదేశించే వరకు వివాదం వెళ్లింది. ఈ సందర్భంగా మంత్రికి సంబంధించిన ఒక అంశం వెలుగులోకి వచ్చింది.

టీడీపీ ఇరిటేట్ చేస్తుందని పంచాయతీ ఎన్నికలు అయ్యేవరకు మీడియాకు దూరంగా ఉండాలని అనుకున్నారట మంత్రి కొడాలి. ఆ మేరకు కొద్ది రోజులుగా ఎవరికీ అందుబాటులో ఉండకుండా.. తెరవెనక ఎన్నికల పనులు చేసుకుంటున్నారట. అయితే పౌరసరఫరాల శాఖలో డోర్‌ డెలివరీ వ్యవస్థపై మీడియాలో వ్యతిరేక కథనాలు రావడంతో… వాటిని ఖండించడానికి ఆ శాఖ మంత్రిగా మీడియా ముందుకు వచ్చారు. ఎంత కంట్రోల్‌.. కంట్రోల్‌ అని అనుకున్నా.. కంట్రోల్‌ తప్పేశారు.
ఇక కొడాలి నాని సొంత పంచాయతిలో వైసీపీ ఓటమి పాలైందని మళ్లీ ప్యూహత్మక ప్రచారం మొదలు పెట్టింది టీడీపీ. ఇప్పుడు దీని పై కూడా మంత్రి కాస్త ఘాటుగానే స్పందించారు. తనకు సంబంధంలేని ఊరి పై టీడీపీ ప్యూహత్మక ప్రచారం మొదలుపెట్టడంతో ఇప్పుడు మళ్లీ కొడాలి నాని డిఫెన్స్ లో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news