భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా జట్టులో ఒక ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెల్సింది. సదరు క్రికెటర్‌కు ఎలాంటి లక్షణాలు లేవని బీసీసీఐ వర్గాలు తెలపగా… ఏ క్రికెటర్‌కు కరోనా వచ్చిందనే విషయాన్ని బీసీసీఐ రహస్యంగా ఉంచింది. ప్రస్తుతం ఆ క్రికెటర్‌ను క్వారంటైన్లో ఉంచారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం బీసీసీఐ టీమ్‌ఇండియా ఆటగాళ్ళకు విశ్రాంతి ఇచ్చింది. దీంతో ఈ హాలీ డేలో ఆటగాళ్ళు కుటుంబ సభ్యులతో బ్రిటన్ అంతా చుట్టివచ్చారు. ఇక జులై 14తో హాలీ డే ముగియడంతో జట్టు తిరిగి కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు కోవిడ్ టెస్టు చేయగా.. ఒకరికి పాజిటివ్ తేలింది. దీంతో కొవిడ్ సోకిన క్రికెటర్ మినహా మిగతా జట్టు డర్హమ్‌కు పయనమైంది. డర్హమ్‌లో జూలై 20 నుంచి భారత జట్టు కౌంటీ ఛాంపియన్‌షిప్ ఎలెవన్ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీసులో భాగంగా ఆగస్టు 4న తొలి టెస్టు మొదలవనున్న విషయం తెల్సిందే.