తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ శాసనసభలో పద్దులపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. హైదరాబాద్ వాసులకు కేటీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. ఈ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి ఓవైపు తీవ్రంగా శ్రమిస్తుంటే.. మరోవైపు.. రక్షణశాఖ భూముల విషయంలో కేంద్రం సహకరించటం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఏడున్నరేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. కేంద్రానికి మనసు రావటం లేదని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో రోడ్ల విస్తరణకు అడ్డంకిగా మారిన మతపరమైన నిర్మాణాల విషయంలోనూ చట్టం చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రి… వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం కింద ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. రెండోదశలోనూ 36 ప్రాజెక్టుల్ని చేపడుతున్నామన్న మంత్రి… త్వరలోనే వాటికి అనుమతిలిచ్చి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.