‘‘అన్నిరంగాలకూ 24 గంటలపాటు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. 7778 మెగావాట్ల సామర్థ్యం నుంచి ప్రస్తుతం విద్యుదుత్పత్తి సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. ఈ బడ్జెట్‌లో రూ.12,727 కోట్లను విద్యుత్‌శాఖకు ప్రతిపాదించారు.
‘భద్రాద్రిలో 1080 మెగావాట్లు, కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్‌లో 800 మెగావాట్లు, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. దీనికి అదనంగా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో 5,741 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతోంది.’ అని చెప్పారు.