తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతుందా.. అంటే పరిణామాలు చూస్తే నిజమే అని తెలుస్తోంది. తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై వీ. హన్మంతరావు ఈరోజు రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. రాజగోపాల్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

అయితే తనకు అవమానం జరిగిన చోట ఉండలేనని రాజగోపాల్ రెడ్డి అన్నట్లు సమాచారం. అయితే పార్టీ నాయకత్వంపై ఏదైనా సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకుందాం అంటూ వీహెచ్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం వద్దకు తీసుకెళ్లాలని వీహెచ్, రాజగోపాల్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. అయితే తనకు కాంగ్రెస్ సభ్యులు కనీసం మద్దతు కూడా తెలపలేదని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డితో సంబంధం లేనట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిదని పార్టీపై గుర్రుగా ఉన్నారు.