ఆగస్టు 8న స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ప్రారంభ సభ : సీఎస్ సోమేశ్ కుమార్

-

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో బీఆర్కే భవన్ లో సమావేశమయ్యారు. వజ్రోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు.

వజ్రోత్సవాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే రోజువారీ కార్యక్రమాలను రూపొందించిందని సీఎస్ పేర్కొన్నారు. ఆగస్టు 8వ తేదీన జరిగే ప్రారంభోత్సవ సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. దేశ సమైక్యత, దేశ భక్తిని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఇప్పటికే కోటి జెండాలను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా అన్ని సినిమా థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నట్టు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version