తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఎంసెట్, 11 గంటల 45 నిమిషాలకు ఈసెట్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. జేఎన్టీయూహెచ్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్.. 30, 31న అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు లక్షా 56 వేల 812 మంది.. అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం 80 వేల 575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించింది.
దీంతో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈనెల 1న నిర్వహించిన ఈసెట్ కు 9 వేల 402మంది హాజరయ్యారు. ఫలితాలను అందరు సానుకూలంగా తీసుకోవాలని.. విద్యార్థులెవరూ క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. జీవితమంటే కేవలం చదువు మాత్రమే కాదని.. మీరనుకున్న ర్యాంకు రాకపోతే మళ్లీ ప్రయత్నించడి కానీ.. ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు.