తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన ఈ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని.. కేబినెట్ నిర్ణయించింది.
అలాగే రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్తగా పది లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, మరియు స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది.
ఈనెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడంతో పెద్ద ఎత్తున వివాహాది శుభ కార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.