తెలంగాణలో లిక్కర్ కన్నా బీర్ల అమ్మకాలే అధికం…

తెలంగాణ సర్కారుకు ఆదాయం తెచ్చిపెడుతున్న వాటిలో మద్యమే కీలక పాత్ర వహిస్తుంది. అయితే అలాంటి మద్యం అమ్మకాల్లో ఏవి ఎక్కువ అమ్ముడవుతున్నాయో తెలుసా.. తాజా ఆదాయ వివరాలను పరిశీలిస్తే తెలంగాణలో లిక్కర్ అమ్మకాల కన్నా బీర్ల అమ్మకాలే అధికం అని తెలియజేస్తున్నాయి. అయితే కరోనా కాలంలో బీర్ల కన్నా లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా సాగాయి. ఈనేపథ్యంలోనే బీర్ల ధరలను తగ్గిస్తూ ఎక్సైజ్ శాఖ బీర్ల రేట్లను తగ్గించింది. అయితే ఓవరాల్ గా అమ్మకాలను చూస్తే మాత్రం లిక్కర్ అమ్మకాలపై బీర్ల అమ్మకాలే అధికంగా ఉన్నాయి.

గత ఆరేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత మద్యం విధానంలో గడచిన రెండేళ్లలోనే రూ.50 వేల కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. ఈ వ్యవధిలో 19 కోట్లకుపైగా కేస్‌ల లిక్కర్‌ అమ్ముడవగా, సుమారు 23 కోట్లకు పైగా బీర్‌ కేస్‌లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త మద్యం పాలసీ తర్వాత వచ్చే రెండేళ్లలో సుమారు రూ. 60 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచానా వేస్తోంది. జిల్లాల వారీగా మద్యం అమ్మకాలు చూస్తే రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉండగా.. గద్వాల జిల్లా చివరి స్థానంలో ఉంది.