గీత కార్మికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా తీసుకురాబోతున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గౌడకులస్థుల సమావేశం నిర్వహించారు మంత్రి హరీశ్ రావు. గీత కార్మికుల కోసం ఎన్ని అభ్యంతరాలు వచ్చినా.. హైదరాబాద్ లో కల్లుడిపోలు కేసీఆర్ తెరిపించారన్నారు. హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతోందని.. కల్లుడిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదని తెలిపారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు లేకుండా చేసి గీతకార్మికులను ఆదుకున్నామన్నారు. గతంలో 2 ఏళ్లకోసారి కల్లుడిపోల లైసెన్సుల పునరుద్ధరణ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు దీన్ని పదేళ్లకు పెంచామని వెల్లడించారు. కల్లు ఆరోగ్యానికి మంచిదని భావించి.. హైదరాబాద్ లో నీరా షాపులు ఓపెన్ చేస్తున్నామన్నారు..

కరోనా రాకపోతే ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రారంభించేవాళ్లమని.. త్వరలో హైదరాబాద్ లో ప్రారంభిస్తామని వివరించారు. నీరా దుకాణాలు హైదరాబాద్ లో సక్సెస్ అయితే.. అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని.. 50 ఏళ్లకే గీతకార్మికులకు 2016 రూపాయల ఫించన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. ముదిరాజ్ లకు ఇచ్చినట్లుగా గీతకార్మికులకు లూనా(మోపెడ్)లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు. ఇదే తరహాలో మత్స్య, చేనేత కార్మికుల బీమా కూడా తేవాలని సీఎం ఆలోచిస్తున్నారన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా ఈత, తాటి వనాలు పెంచుతున్నామని పేర్కొన్నారు.