క్యాన్సర్‌ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..నివారణకు మూడంచెల వ్యూహం

-

క్యాన్సర్‌ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద వరల్డ్ బ్రెస్ట్ కేన్సర్ నెల సందర్బంగా నిర్వహిస్తున్న అవగాహన వాక్, మారథాన్ జెండా ఊపి ప్రారంభించిన ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు… మారిన జీవిన శైలి, మారిన ఆహార అలవాట్లు తదితర కారణాల వల్ల చిన్న తనంలోనే రోగాల బారిన పడుతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యాధికి సంబంధించిన అవగాహన లేకపోవడం కారణంగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో నిర్ధారణ జరుగుతున్నది. దీంతో చికిత్స అందించడం కష్టంగా ఉంటున్నది. 70 శాతం కేసుల విషయంలో ఇలా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ముందుగా గుర్తిస్తే వంద శాతం ప్రాణాలు కాపాడవచ్చని.. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షా 80 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని అంచనా ఉండగా, ఆలస్యంగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందక పోవడం కారణంగా ఇందులో 50 శాతం దాకా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అమెరికాలో అయితే జీవిత కాలంలో ప్రతి 8 మంది మహిళల్లో కనీసం ఒకరు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి…బయటికి వెళ్తే జంక్ ఫుడ్, విస్తృతంగా ప్లాస్టిక్ వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం… ఇలా అనేక అంశాలు కారణం అవుతున్నాయన్నారు మంత్రి హరీష్‌ రావు. మహిళల్లో కాన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. తెలంగాణలోని కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కేన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నది.

ఇందులో భాగంగా, మొబైల్ స్క్రీనింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నాం. ఒక్కో నెలలో సగటున 6 క్యాంపులు పెడుతూ, సగటున 600 నుండి 800 మందికి పరీక్షలు చేస్తున్నాము. నిర్ధారణ అయినా వారిని మెరుగైన చికిత్స కోసం MNJ ఆసుపత్రికి పంపిస్తున్నాము. ఇక చికిత్స విషయంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నది. క్యాన్సర్ చికిత్స పై తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం రు. 750 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల కేన్సర్ లకు సమగ్రమైన కేన్సర్ చికిత్సలు అందిస్తున్నది.సర్జికల్, రేడియేషన్, మెడికల్ ఆంకాలజి, బ్లడ్ కేన్సర్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్, పాలియేటివ్, మొబైల్ స్క్రీనింగ్.. ఇలా 10 రకాల కార్యక్రమాలు చేస్తున్నదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news