తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ అంటే చిన్నచూపు అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గవర్నర్‌కు కనీస మర్యాద ఇవ్వకుండా అవమానిస్తున్నారని..ఇది అహంకారపూరితమని పేర్కొన్నారు. ఇప్పటివరకు గణతంత్ర దినోత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదని ఆమె చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన ‘పరీక్ష యోధులు’ పుస్తకాన్ని గురువారం రాజ్‌భవన్‌లో ఆమె ఆవిష్కరించారు.
‘ఖమ్మం సభలో గవర్నర్లపై చేసిన విమర్శల’పై ప్రస్తావన రాగా గవర్నర్ తీవ్రంగా స్పందించారు. సీఎంల వ్యాఖ్యలను ఖండించారు. ‘‘నేను పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎక్కడా హద్దులు మీరలేదు. ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నా. మా కార్యాలయంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే.ఆ బిల్లుల కంటే ముందు నుంచే ప్రొటోకాల్ అంశం పెండింగ్‌లో ఉంది. ప్రొటోకాల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్లను అవహేళన చేయడం, అవమానించడం తగదు. మిగిలిన రాష్ట్రాల గురించి నేను చెప్పను. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడను. గవర్నర్ స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు కూడా త్వరలో జరగనున్నాయి. ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారు’’ అని గవర్నర్ తెలిపారు.