హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శామీర్ పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలోని జర్నలిస్టులకు కరోనా టీకాను అందిస్తామని తెలిపారు. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు చేస్తూ విజ్ఙప్తులను పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఈటేల వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో మొత్తం 38,31,907 ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని తెలిపారు. దీనికోసం 23,331 పోలియో బుత్‌లతో పాటు 877 మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. శామీర్‌పేట ఆరోగ్య కేంద్రాన్ని త్వరలోనే ట్రామా సెంటర్‌గా మారుస్తామని ఈటల తెలిపారు.
అక్కడి నుంచి బయలుదేరిన ఈటల.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం పెరిగినప్పటికీ.. ప్రజలకు తక్కువ ధరకు వైద్యం అందడం లేదని అన్నారు. వైద్య ఖర్చులు భరించలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారనీ, ఈ పరిస్థితిలో మార్పు రావాలనీ, తక్కువ ధరకే మెరుగైన వైద్య సేవలు అందరికీ చేరాలని అన్నారు.