దిశ నిందితుల‌ను వ‌ద‌ల‌నంటోన్న తెలంగాణ ఎమ్మెల్యే

-

నిత్యం వివాదాల్లో ఉండే గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిశ హ‌త్య ఘ‌ట‌న నిందితుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తున్నారు. దిశ హ‌త్యాచారంలో ఏ1గా పేర్కొంటున్న మ‌హ్మ‌ద్ ఆరిఫ్ చ‌ట్టంలోని లోసుగుల‌తో ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకుని త‌న నుండి త‌ప్పించుకోలేడ‌ని చెప్పారు. దిశ‌ను ఎంత దారుణంగా, క్రూరంగా చంపారో అంత‌కంటే దారుణమైన స్థితిలో నిందితుల చావు ఉంటుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ దిశ హ‌త్య‌కేసు విచార‌ణ‌పై ఆయ‌న స్పందించారు. నిందితుల‌ను రేపిస్టులు అనోద్ద‌ని అంటున్నార‌ని, రేప్ చేసే వారిని రేపిస్టులు అన‌కుండా ఏమ‌నాల‌ని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా రాజాసింగ్ మ‌హ్మ‌ద్‌ను ఉరితీయాల‌ని వ్యాఖ్య‌నించ‌డంతో ఆయ‌న వ్యాఖ్య‌లు ఓ మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని పేర్కొంటూ.. హైదరాబాద్ లోని బహదుర్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు రాజాసింగ్‌పై పోలీసులు మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

అయితే ఈ విష‌యంపై స్పందించిన రాజాసింగ్ త‌న‌కు కేసులంటే భ‌యం లేదని…కేసుల‌కు వెరిసేది లేద‌ని స్ప‌ష్టం చేశారు..దోషుల‌కు ఉరిశిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. త‌న వ్యాఖ్య‌ల్లో త‌ప్పేం లేద‌ని త‌ప్పు చేసిన వాడికి స‌రైన శిక్ష‌ప‌డాల‌ని కోరుతున్నాన‌ని స‌మ‌ర్థించుకున్నారు. ఇక రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కొంత‌మంది బీజేపీ శ్రేణుల నుంచి పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇక నెటిజ‌న్ల‌లో కూడా రాజాసింగ్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. అంద‌రూ ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌విస్తూ త‌మ మ‌ద్ద‌తును తెలుపుతూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌లో ఈ వీడియోల‌ను షేర్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా దిశ హ‌త్యాచార సంఘ‌ట‌న‌పై నిందితుల‌కు త్వ‌రిత‌గ‌తిన త‌గిన శిక్ష‌ప‌డేందుకు హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. (నవంబర్ 28, 2019) శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ పై నలుగురు యువకులు అత్యాచారం చేసి, హత్య చేశారు. అనంతరం షాద్‌నగర్ దగ్గర ఆమెను దహనం చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news