TELANGANA : ఈ వానాకాలంలో 1.13 కోట్ల ఎకరాల్లో సాగు

-

దేశంలో వరి ఆధారిత పంటలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ముందుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇతర పంటల కంటే ఎక్కువ వరినే సాగు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణకు వరి పంట ప్రాణాధారం. ఇక్కడి నేలలు వరి సాగుకు అత్యంత అనుకూలమైనవి. ప్రకృతి సహకరించి.. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తే తెలంగాణ రైతులు కుబేరులవుతారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ వరి దిగుబడి కూడా బాగా ఉంటుంది కాబట్టి. వరి మాత్రమే కాకుండా రాష్ట్రంలో పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు కూడా ఎక్కువ వేస్తారు.

గతేడాది లాగే ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరిసాగు చేస్తున్నారు. ఈ వానాకాలం పంటల సాగు విస్తీర్ణం 1.13 కోట్ల ఎకరాలు దాటిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక వెల్లడించింది. గత జూన్‌ ఒకటి నుంచి బుధవారానికి సాగు కావాల్సిన సాధారణ విస్తీర్ణంకన్నా మరో 10 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికిచ్చిన వారాంతపు నివేదికలో తెలిపింది.

గతేడాది ఇదే సమయానికి 1.14 కోట్ల ఎకరాలకు పైగా సాగవగా ఈ సీజన్‌లో అంతకన్నా తక్కువగా ఉంది. ప్రధాన పంట పత్తి 48.34 లక్షలు, వరి 45.69 లక్షలు, కంది 5.51 లక్షలు, మొక్కజొన్న 5.27 లక్షలు, సోయాచిక్కుడు 3.95 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. వరి తప్ప మరే పంట కూడా సాధారణంకన్నా ఎక్కువ విస్తీర్ణంలో వేయలేదని వ్యవసాయశాఖ తెలిపింది. ఈ వానాకాలం సీజన్‌లో మొత్తం 1.23 కోట్ల ఎకరాలకు పైగా సాగు కావాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ఇంకా 10 లక్షల ఎకరాలు తక్కువగా ఉంది.

పంటలపై తెగుళ్ల నియంత్రణకు చల్లుతున్న ప్రిజమ్‌ క్రాప్‌సైన్స్‌ కంపెనీ తయారుచేసి విక్రయిస్తున్న మోనోక్రోటోఫాస్‌ 36 శాతం ఎస్‌.ఎల్‌. (బ్యాచ్‌ నంబరు ‘పీసీఎస్‌/113/15’) పురుగుమందును, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ తయారుచేసి విక్రయిస్తున్న అజాడిరక్టిన్‌ 1 శాతం ఈసీ (బ్యాచ్‌ నంబరు 2201-29) పురుగుమందును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు వ్యవసాయశాఖ బుధవారం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news