ఇక రోడ్లపై నిబంధనలు పాటించకుండా ఉంటే.. చలాన్లే కాదు.. ఏకంగా లైసెన్స్ రద్దయ్యే ప్రమాదం ఉంది. ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చే డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దు ప్రక్రియను పర్యవేక్షించి.. త్వరితగతిన వాటిపై నిర్ణయం తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది పోలీసు శాఖ. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ప్రక్రియ న్యాయ నిబంధనలకు అనుగుణంగా చేయాల్సి ఉండటంతో అందుకు సంబంధించి జరిగే ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ ఏడాది ఆరు నెలల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో 1721 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు పోలీసులు. అయితే.. ఇష్టానుసారంగా వాహనం నడపినా.. డ్రంకన్ డ్రైవ్ చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటున్నారు పోలీసులు. తొలిసారి డ్రంకన్ డ్రైవ్ చేసి పట్టుబడితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు, రెండోసారి దొరికితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు పోలీసులు షాక్ ఇచ్చారు.
అంతేకాదు.. మోటారు వాహనాల సవరణ చట్టం- 2019, సెక్షన్ 206(4) ప్రకారం హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే వీలు ఉందని, అతివేగం, ఓవర్ లోడ్, మరణాలకు కారణమయ్యే యాక్సిడెంట్లు చేయడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం.. తదితర నేరాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పోలీసులు వెల్లడించారు. పోలీసుల నుంచి ఉల్లంఘనదారుడి వివరాలు రవాణాశాఖకు చేరుకుంటాయని, రవాణా శాఖ అధికారులు వాటిని పరిశీలించి సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేస్తారని పోలీసులు తెలిపారు. పది రోజుల్లో అతడు తన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, అనంతరం రవాణా శాఖ అధికారులు నిర్ణయం మేరకు లైసెన్స్ రద్దు ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు పోలీసులు.