ఆదాయం పెంచుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్గో పార్శిళ్లు, వాటర్ బాటిళ్ల విక్రయం మొదలుపెట్టిన ఆర్టీసీ యాజమాన్యం తాజాగా మరో ప్రయత్నం చేసింది. అదే ‘ఏఎం 2 పీఎం’ ఎక్స్‌ప్రెస్ సర్వీసు. శుక్రవారం రోజున ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ సేవలను ప్రారంభించారు.
‘మధ్యాహ్నం 12 గంటల లోపు పార్సిల్ బుక్ చేస్తే రాత్రి 9 గంటలకు గమ్యస్థానానికి చేరుస్తాం. రాత్రి 9 గంటలలోపు బుక్ చేసుకుంటే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా చేరవేస్తాం. ‘ఏఎం 2 పీఎం’ పేరుతో ఎక్స్‌ప్రెస్ పార్సిల్ సర్వీసులను ప్రారంభించాం. తెలంగాణలో 99 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. త్వరలో ఇతరరాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
‘ప్రస్తుతానికి ఒక కిలో బరువు ఉన్న పార్సిళ్లను మాత్రమే అనుమతిస్తాం. ఆ పార్సిల్ విలువ కూడా రూ.5 వేలకు మించి ఉండకూడదు. ఒక్కో పార్సిల్‌కు రూ.99 వసూలు చేస్తాం. తిరుపతి, బెంగళూరు, కర్నూలు, విజయవాడ నగరాలకు అయిదు కిలోల బరువున్న పార్సిళ్లను చేరవేస్తాం.’ అని సజ్జనార్ అన్నారు.