రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవాళ్టి నుంచి మరో మూడ్రోజులు రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. 41 నుంచి 43 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రం 34 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు మరోవైపు రాష్ట్రంలో శని, ఆదివారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో శుక్రవారం రాష్ట్రంలోనే గరిష్ఠంగా 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయినట్లు చెప్పారు.
ఇక శుక్రవారం రోజున పలుచోట్ల వర్షాలు కురిశాయి. తెల్లవారుజాము నుంచే మొదలైన వాన చాలాచోట్ల ప్రజలను ఇబ్బంది పెట్టింది. అయితే గత కొద్దిరోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర ప్రజలు నిన్న కురిసిన వర్షంతో కాస్త చల్లబడ్డారు.