మరోసారి తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మార్పు

-

తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను మరోసారి మార్చారు. ప్రొ.శివశంకర్ స్థానంలో బి.విద్యావర్ధినికి రిజిస్ట్రార్​గా వీసీ రవీందర్ గుప్తా బాధ్యతలు అప్పగించారు. పద్నాలుగు నెలల్లో ఇప్పటికే ఐదుగురు రిజిస్ట్రార్​లను మార్చిన వీసీ రవీందర్ గుప్తా ఇప్పుడు మరోసారి మార్చారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడి దశాబ్దం గడుస్తున్నా.. ఇంకా సమస్యల సుడిగండంలో కొట్టుమిట్టాడుతూనే ఉందని విద్యార్థులు వాపోతున్నారు. క్యాంపస్​లో కనీస సౌకర్యాలు లేవంటూ ఆందోళనకు దిగారు. ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

వర్సిటీ లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా విద్యార్థులు అడ్డుకుంటున్నారు. విద్యార్థుల ఆందోళనకు యూనివర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బంది మద్దతు తెలిపారు. భాజపా డిచ్​పల్లి ఎంపీపీ గద్దె భూమన్న నిరసనలో పాల్గొని విద్యార్థులకు బాసటగా నిలిచారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విశ్వవిద్యాలయానికి కనీస రవాణా సౌకర్యం లేదని.. సమస్యలు తాండవం చేస్తున్నాయని పేర్కొన్నారు.

వీసీ స్పందించే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. తక్షణమే సమస్యలన్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నూతన బాలికల హాస్టల్, మెస్​లో సౌకర్యాలు, స్పోర్ట్స్ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని విద్యార్థులు కోరారు. హెల్త్ కేర్ సెంటర్​లో వైద్యుడిని నియమించి అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news