ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం మరికొన్ని గంటల్లో రాబోతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ మధ్యాహ్నం విడుదల కానుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఈ రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు.
ఈ రాష్ట్రాల్లో నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ తొలి వారంలోపు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం శాసనసభ గడువు డిసెంబర్ 17తో ముగియనుంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి. పోలింగ్ తేదీలు మాత్రం 5 రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయని సమాచారం. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.