నైరుతి రుతుపవనాల రాకతో ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఈ రుతుపవనాల ప్రభావం దక్షిణ భారతంపై అంతగా కనిపించడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక తెలంగాణలో అయితే అడపాదడపా వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. జూన్ మాసం దాదాపు వేసవిలాగే గడిచిపోయింది. ఇక జులైలోనైనా వానలు దంచికొడతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో జులైలో సాధారణం లేదా ఎక్కువ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ శుక్రవారం తెలిపింది. జూన్‌లో సాధారణం కన్నా 50శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. సాధారణం కన్నా 20 శాతానికి పైగా లోటు ఉంటే తీవ్ర వర్షాభావం ఉన్నట్లు పరిగణిస్తారు. గత మూడేళ్లలో ఎప్పుడూ జూన్‌లో 50శాతం లోటు నమోదు కాలేదు.
బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.