గంట సేపు దీక్ష చేయలేని కేసీఆర్…. దేశాన్ని పాలిస్తారా..?: బండి సంజయ్

ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గంట సేపు దీక్ష చేయలేని కేసీఆర్ దేశాన్ని పాలిస్తారా..? అంటూ ప్రశ్నించారు. గంట సేపు దీక్ష చేసే సమయం లేని ముఖ్యమంత్రి దేశంలో రాజకీయ సమీకరణాలు మారుస్తానని.. ప్రకంపనలు కలిగిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని విమర్శించారు. 

ప్రజాసంగ్రామ  యాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల ముసుగులో దాడులు చేయించి రెచ్చగొట్టేలా స్కెచ్ వేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేలా సీఎం ప్లాన్ వేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం రాళ్ల దాడులను భరించేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు. ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటిస్తామని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ అరాచకాలు, కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనను ఎండగడుతాం అంటూ ఫైర్ అయ్యారు.