దొరల ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలి – భట్టి విక్రమార్క

-

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా భట్టి మాట్లాడుతూ.. తన స్వార్థం కోసం పాదయాత్ర చేయడం లేదని.. సమస్త తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. బిఆర్ఎస్ నేతలు పందికొక్కుల్లా ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారని.. దొరల ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ధనిక రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. 100 సంవత్సరాలకు సరిపోయే తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచేసిందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొలువులు రాక విద్యార్థులు, నిరుద్యోగులు గడ్డాలు పెంచుకొని రోడ్డుమీద తిరుగుతుంటే ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారని అన్నారు. కేసీఆర్ దొర చేస్తున్న దోపిడీతో సాధించుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేరడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news