ఈ పాలకులకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది – విజయశాంతి

-

టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి సోషల్ మీడియా వేదికగా మడిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. తెలంగాణలో పరిపాలనా యంత్రాంగం ఎంత దారుణంగా గాడి తప్పిందో… ప్రజా రక్షణ వ్యవస్థ ఎలా కుప్పకూలిందో తాజాగా జరిగిన పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయన్నారు.

సమస్యలు ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో బాధితులు నేరుగా కలెక్టర్ కార్యాలయాలకే వచ్చి ఆందోళనలు, ఆత్మాహుతి యత్నాలు చేస్తున్నారంటే క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఎంతగా చతికిలబడిందో చెప్పాల్సిన పని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో దివ్యాంగుడైన ఒక పౌరుడు పింఛన్ కోసం పెట్రోల్ పోసుకున్నడు. ధరణి పోర్టల్‌లో వివరాలు మార్చి తన భూమి కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నయని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఒక మహిళా రైతు బ్లేడుతో చేయి కోసుకుంది. పదేళ్లుగా నడుపుకుంటున్న దుకాణాన్ని మూయించేశారంటూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద మరో పౌరుడు కూడా పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నం చేశాడు.

సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి… డబుల్ బెడ్రూం లబ్ధిదారుగా అర్హుల జాబితాలో ఒక ఆటోడ్రైవర్ భార్య పేరు ఉన్నప్పటికీ అమెకు ఇల్లు కేటాయించకుండా వేధిస్తున్నరని ఆ డ్రైవర్ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పెడుతూ కలెక్టరేట్ ప్రాంగణంలోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఈ సంఘటనలన్నీ మీడియాలో వచ్చాయి. ఇదీ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తున్న తీరు. ప్రజల్ని పలు విధాలుగా వేధిస్తున్న ఈ పాలకులకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది ” అన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news