తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే అధికార బీఆర్ఎస్ ప్రచారంలో జోరు సాగించింది. ఇక షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రచారంలో మరింత దూసుకెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి.. ప్రచార హోరు సాగిస్తున్న గులాబీ దళం.. తాజాగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించింది.
ఈ నేపథ్యంలోనే 54 నియోజకవర్గాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పాటు కొందరు మంత్రులను ఇంఛార్జిలను నియమించింది. వీరంతా అభ్యర్థులకు తోడుగా ఉంటూ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ప్రచారం ప్రణాళికబద్ధంగా జరిగేలా పనిచేయాలని బీఆర్ఎస్ నాయకత్వం సూచించింది. కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో కేటీఆర్‌తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఇంచార్జిగా వ్యవహరిస్తారు.
గజ్వేల్ పర్యవేక్షణ బాధ్యతలు హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి అప్పగించగా. ఎస్సీ నియోజకవర్గాలైన కంటోన్మెంట్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చొప్పదండికి గంగుల కమలాకర్, మధిరకు పువ్వాడ అజయ్‌ను ఇంచార్జిలుగా నియమించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ నియోజకవర్గం బాధ్యతలు చూస్తారు. ఎమ్మెల్సీ కవిత బోధన్, నిజామాబాద్ అర్బన్‌కు ఇంచార్జిగా వ్యవహరిస్తారు.