మిత్రుడిపై కేసీఆర్ ఫైర్ ? ఎందుకో ఇంత కోపం ?

-

తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ ఇద్దరూ ఎంతటి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ సహకరించుకుంటూ, ఎక్కడా ఎటువంటి వివాదాలు తలెత్తకుండా చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఇద్దరు మిత్రుల మధ్య కొంత కాలంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంశం వివాదానికి కారణం అయ్యింది. అయితే ఈ వివాదాలపై రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం తప్పదని, జగన్- కెసిఆర్ స్నేహం ఇక ముగిసినట్లే అని అంతా అనుకుంటున్న సమయంలో, కేసీఆర్ ఓ సందర్భంలో విలేకరుల సమావేశంలో తీవ్రంగా స్పందించారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి కదా అంటూ మీడియా ప్రశ్నించగా.. కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

తమ మధ్య కిరికిరిలు పెట్టవద్దు అని, తమ మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవని, ఏ సమస్యనైనా సామరస్యపూర్వకంగా పరిష్కరించకుంటాము అని కెసిఆర్ ధీమాగా చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ తాజాగా ఫెయిర్ అవుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏం విషయాలు మాట్లాడాలి అనే విషయంపై తాజాగా కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వ్యవహారం పై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ విషయంలో తాము సానుకూలంగా ఉంటున్నప్పటికీ, నదీజలాల విషయంలో కావాలని తమతో ఏపీ ప్రభుత్వం కయ్యం పెట్టుకుంటుందని కెసిఆర్ మండిపడ్డారు.

ఇకపై తెలంగాణ జోలికి ఎవరూ రాకుండా, అపెక్స్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అయితే ఇంత అకస్మాత్తుగా జగన్ పైన, ఏపీ ప్రభుత్వం పైన కెసిఆర్ ఈ స్థాయిలో మండిపడడానికి కారణం లేకపోలేదనే వాదనలు ఇప్పుడు బయలుదేరాయి. తాము కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ, ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తుంటే, జగన్ ప్రతి దశలోనూ కేంద్రానికి మద్దతు ఇస్తూ, బిజెపి కేంద్ర పెద్దల అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉండటం వంటి వ్యవహారాలు కెసిఆర్ కు ఆగ్రహం కలిగిస్తున్నాయట.

అలాగే విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు బిల్లులపై టిఆర్ఎస్ అభ్యంతరం తెలుపుతున్నా పట్టించుకోకుండా, వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి మద్దతుగా నిలవడం ఇవన్నీ కేసీఆర్ కు ఆగ్రహం కలిగిస్తున్నాయట. మొదటి నుంచి జగన్ కు తాను అన్ని విషయాల్లోనూ సహకారం అందిస్తూ వస్తుంటే, ఇప్పుడు తాము శత్రువు గా భావిస్తున్న బీజేపీ తో జగన్ అంటకాగడాన్ని కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు అవకాశం దొరకడంతో ఏపీ ప్రభుత్వం పై కేసీఆర్ ఈ స్థాయిలో మండిపడిపోతున్నారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news