రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణ, విధి విధానాలు సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని కోసం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అధ్యక్షతన ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో సీఎం సమావేశమవుతారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
మరోవైపు.. ఆగస్టు 2 నుంచి 15 వరకు.. ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండా ఫొటోను పెట్టుకోవాలని మోదీ కోరారు.
“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నాం. ఆ మూడు రోజులు.. ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోండి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మనమందరం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నాం. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారు.” అని మోదీ అన్నారు.