తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ ఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ శ్రీ సంజయ్ జాజుతో ఆయన సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు (41.68:58.32 నిష్పత్తిలో) వెళుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.