ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటవీ హక్కు చట్టం ద్వారా భూమిలేని నిరుపేదలకు కాంగ్రెస్ హయాంలో దాదాపు 25 లక్షల ఎకరాలను పంచిపెట్టినట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నేడు గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక కుటుంబానికి 54 ఎకరాలకు మించి భూమి ఉండకూడదని సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పారదర్శకంగా నిజమైన భూ యాజమానుల రికార్డులను నమోదు చేసిందన్నారు.
తెలంగాణలో 20 లక్షల మంది ధరణి బాధితులు ఉన్నారని.. ధరణి పోర్టల్ కెసిఆర్ కు కామధేనువుగా మారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామని.. 30% కమిషన్లు తీసుకున్న బిఆర్ఎస్ నేతలపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. కెసిఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి.. వారిని అందులోకి పంపిస్తామని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భూ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన టైటిల్ గ్యారెంటీ స్కీమ్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీకి కాకుండా ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పిందని తెలిపారు. రాష్ట్రంలోని భూముల వివరాలు ప్రభుత్వం వద్ద లేవని.. ఇతర దేశాల కంపెనీలకు అమ్మేశారని వెల్లడించారు.