తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై ఓటర్లు నివ్వెరపోయారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలపై విచారణ జరపాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. వీలైనంత త్వరగా ఆ విచారణ నివేదిక అందించాలని సూచించింది.
ఇంతకీ కౌశిక్ రెడ్డి ఏమన్నారంటే..?
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున.. భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్ర యాత్రతో వస్తా.. ఓడితే నా శవయాత్రకు మీరు రావాల్సి ఉంటుంది. నేను ఓడిపోతే భార్యా బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంటా. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లను కౌశిక్ రెడ్డి అభ్యర్థించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదకరంగా ఉండటంతో పాటు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నివేదిక కోరింది.