నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది – బండి సంజయ్

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మంగళవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 1 తో సహా టిఎస్పిఎస్సి పరీక్షలన్నీ లీక్ అయ్యాయని, లీక్ చేసిన నిందితుడు ప్రవీణ్ కు అత్యధిక మార్కులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుందని.. ఆయనకు తెలియకుండా పేపర్ లీక్ కావడం అసాధ్యమని చెప్పారు.

ప్రశ్నాపత్రం ఏ ఒక్క ఉద్యోగి కంప్యూటర్ లో ఉండడానికి వీల్లేదని, అలాంటిది ఒక సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్ లో ఎలా ప్రత్యక్షమవుతాయని ప్రశ్నించారు. చైర్మన్, సెక్రటరీ ప్రమేయం లేకుండా లీక్ అసాధ్యమన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యాయని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.