రేపు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు పట్టణ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నారు సీఎం కేసీఆర్. అనంతరం అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం రాజీనామా చేసిన చరిత్ర బిఆర్ఎస్ ఎమ్మెల్యేలది అయితే.. పదవుల కోసం రాజీ పడ్డ చరిత్ర కాంగ్రెస్ దని అన్నారు.
సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంటే.. కాంగ్రెస్ దగా ఉత్సవాలు నిర్వహించి అమరులను అవమానపరిచిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు హరీష్ రావు. ప్రజలు పండుగ చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ కళ్లల్లో నిప్పులు పోసుకుంటుందని దుయ్యబట్టారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కుల్లుకోవడం దారుణమని మండిపడ్డారు.