సొంతిళ్లు కొనుక్కోవాలనేది చాలా మంది కల. అయితే లోన్ తీసుకుని, డబ్బు కూడబెట్టుకుని ఇలా తమకంటూ ఓ ఇల్లుని కొనుక్కోవాలనుకుంటారు చాలా మంది. హైదరాబాద్లో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోందట. పెరుగుతున్న ఇంటి రిజిస్ట్రేషన్ల సంఖ్యను చూస్తోంటే అది నిజమేననిపిస్తోంది.
హైదరాబాద్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జులైతో పోలిస్తే ఆగస్టులో 20% పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. జులైలో ఇక్కడ 4,313 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని.. ఆగస్టులో ఈ సంఖ్య 5,181కు పెరిగిందని తెలిపింది. గత నెలలో రిజిస్టర్ అయిన ఇళ్ల విలువ రూ.2,658 కోట్ల మేరకు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
ఇందులో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య రిజిస్ట్రేషన్ విలువ ఉన్న ఇళ్ల వాటా 55% ఉన్నట్లు విశ్లేషించింది. 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ స్థలం ఇళ్ల వాటా 83 శాతం ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్- మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు నెలాఖరు వరకూ హైదరాబాద్లో 46,078 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు, ఈ ఇళ్ల విలువ రూ.22,680 కోట్లు ఉన్నట్లు వివరించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు సంఖ్య 36% తక్కువగా ఉండటం గమనార్హం.