గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు.. రెండు ముక్కలైన వ్యక్తి

హైదరాబాద్ లోని జీడిమెట్ల పరిధిలో దారుణం జరిగింది. సుభాష్ నగర్ లో నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి శరీరం రెండు ముక్కలైంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే రాంవిలాస్ అనే వ్యక్తి ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అక్రమంగా నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు.

అయితే ఇవాళ ఉదయం గ్యాస్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో లీకేజీ వల్ల భారీ పేలుడు సంభవించింది. దీంతో గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న ముకుంద్ (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ సెంటర్లో పని చేస్తున్న మరో ఇద్దరు కుమార్(25), విజయ్ (25)కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూరారం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో విజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.