బిజెపి – టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో రూ. 200 కోట్ల ధాన్యం నీళ్ల పాలయింది – రేవంత్ రెడ్డి

రైతుల నుంచి ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసిన కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వ చేసిన ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడ మిల్లుల్లో నిలిచిపోయి భారీ వర్షాలకు తడిసి పెద్దఎత్తున మొలకెత్తుతున్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లాలో రైస్ మిల్లర్లు ధాన్యం బస్తాలు మిల్లుల ఆవరణలో, ఆరుబయట గోదాముల్లో నిల్వ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తింది. మొలకెత్తిన ధాన్యాన్ని చూసి మిల్లర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు సగటున 20 శాతం తడిసి మొలకెత్తినట్లు మిల్లర్లు వెల్లడించారు.

అయితే ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ – టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో రూ.200 కోట్ల విలువైన ధాన్యం నీళ్ళ పాలైంది అంటూ ట్వీట్ చేశారు.” బీజేపీ – టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో రూ. 200 కోట్ల విలువైన ధాన్యం నీళ్ల పాలైంది. ఇవి మోడీ, కెసిఆర్ జేబులో డబ్బులు కాదు.. తెలంగాణ ప్రజలు రక్తం, చెమట ధారపోసి కట్టిన పన్నుల సోమ్ము. బాధ్యత లేదా రెండు ప్రభుత్వాలకి..!? అంటూ ప్రశ్నించారు.