ఉలుకు పలుకు లేదు అంటూ కేంద్రంపై కేటీఆర్ ఫైర్ ?

-

గత కొంతకాలంగా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కేంద్ర అధికార పార్టీ బిజెపి కి మధ్య రాజకీయ విమర్శలు పెరిగిపోతున్నాయి. కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల పై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, నిధులు విడుదల జాప్యం చేస్తోందని గత కొంత కాలంగా టిఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒక పార్టీ పెట్టబోతున్నారని, బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి కూటమి గా ఎన్నికల్లో పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించినా, దీనిపై వార్తలు వస్తూనే ఉన్నాయి.
తెలంగాణ బిజెపి నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం పై పదే పదే విమర్శలు చేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తూ చేస్తున్నారు. ఈ విధంగా రెండు పార్టీల మధ్య రాజకీయ విమర్శలతో తెలంగాణ దద్దరిల్లుతోంది. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రోడ్లను నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కేంద్రం ఉన్న రోడ్లను  మూసి వేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రహదారుల అభివృద్ధికి నాలుగు రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
రక్షణ రంగానికి చెందిన కంటోన్మెంట్ స్థలాలను రాష్ట్రానికి ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులో కంటోన్మెంట్ రోడ్లు మూసివేత అంశం గురించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఇప్పటికే పది సార్లు పైగా లేఖలు రాసినా స్పందన లేదని, తెలంగాణ ప్రభుత్వం ఏది కోరిన ఉలుకూ పలుకూ లేకుండా ఉంటున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాస్తవంగా లాక్ డౌన్ సమయంలోనే రోడ్లను అభివృద్ధి చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తే కేంద్రం సహకరించలేదని అన్నారు. బిజెపి నాయకులు ప్రజాప్రతినిధులు విభజన రాజకీయాలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తే మంచిదని కేటీఆర్ హితవు పలికారు.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news