రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ అంశంపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. ప్రతి చిన్న అంశానికీ అనర్హతను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం క్రమంగా క్షీణించిపోతుందని అన్నారు. పదవి కోల్పోయిన వ్యక్తిగా రాహుల్‌కు పైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఒక వేళ పై కోర్టులో శిక్షను తగ్గించినట్లయితే అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
‘‘ ఏ ప్రజాప్రతినిధి అయినా ఉద్దేశం ఉన్నా లేక పోయినా, ఓ కులం పేరు చెప్పి, ఇంటి పేరు చెప్పి దూషించడం పొరపాటే. రాహుల్ గాంధీ విషయంలో చేసిన నేరానికి , పడిన శిక్షకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. లోక్‌సభ అధికారులు కూడా అత్యుత్సాహంతో అనర్హతను అమలు చేయాల్సిన అవసరం లేదు. న్యాయ నిపుణుల సలహా తీసుకొని, అవసరమైతే సుప్రీం కోర్టు సలహాకి పంపించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కీలక నాయకుల్ని సాంకేతిక కారణాలు చూపించి.. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి, అధికార పార్టీకి అంత మంచిది కాదు.’’ అని జేపీ అన్నారు.