కెసిఆర్ దొంగ దీక్ష చేశారు – రేవంత్ రెడ్డి

శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన యూత్ డే సదస్సులో పాల్గొన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది ఓయూ అని, ఇక్కడి విద్యార్థులలో పోరాట పటిమ ఉందని అన్నారు. కెసిఆర్ దొంగ దీక్ష చేశారని, ఖమ్మం ఆసుపత్రిలో నిమ్మరసం తాగారని ఆరోపించారు.

” ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తామని చెప్పి టీఆర్ఎస్ గద్దెనెక్కింది. మలిదశ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ 550 కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించలేదు. వారి ఆచూకీ తెలియదని ప్రభుత్వం చెబుతోంది. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉంటుందా? తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి ప్రభుత్వానికి గుర్తు రాలేదా?” అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.